ఆయన వయసు 188 కాదు!

Spread the love
  • వృద్ధుడి వైరల్ వీడియోపై ఫ్యాక్ట్

బెంగళూరు (ఇలాకా): సోషల్‌మీడియాలో కనిపించే కంటెంట్‌లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవటం ప్రస్తుతం చాలా కష్టంగా మారింది. ఇటీవల ఓ ఫొటో ట్విట్టర్‌లో చక్కర్లు కొట్టింది. ఓ పండు ముదుసలి వ్యక్తిని ఇద్దరు యువకులు నడిపించుకొంటూ తీసుకెళ్తున్న ఫొటో అది. ఆ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి.. ‘ఈయన వయసు 188 ఏండ్లు.. బెంగళూరు సమీపంలోని ఓ గుహ నుంచి ఆయనను రక్షించారు’ అని రాసుకొచ్చాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఏకంగా 50 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే, ఆ వృద్ధుడి వివరాలను ఫ్యాక్ట్‌చెక్ యూజర్లు తేల్చేశారు. ఆయన పేరు సియారామ్ బాబా అని, వయసు దాదాపు 110 ఏండ్లు అని వెల్లడించారు. ప్రస్తుతం సియారామ్ బాబా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఉన్న భత్యన్ ఆశ్రమంలో ఉన్నారు. ఆయన పుట్టింది ముంబైలో.. అక్కడే ఏడో తరగతి వరకు చదువుకొన్నారు. అనంతరం హిమాలకు వెళ్లి తపస్సు చేశారు. ఆంజనేయ స్వామి భక్తుడు. ఇప్పటికీ ఆయన ఏకబిగిన 21 గంటలపాటు చదవగలరట. గతంలో పదేండ్లపాటు ఒంటికాలుపై బాబా తపస్సు చేశారని చెప్తున్నారు. ఈ వివరాలన్నీ బయటకు రావటంతో మొదట ఈ ఫొటోను పోస్ట్ చేసిన ఎక్స్ యూజర్ తన తప్పును సవరించుకొన్నారు. బాబా వయసు 188 ఏండ్లు అని రాసేటప్పుడు తనకే నమ్మకం కలుగలేదని పేర్కొనటం విశేషం.