రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థిని మౌనిక

Spread the love

చెర్కుపల్లి (ఇలాకా): అండర్ 14 విభాగంలో రాష్ట్ర స్థాయిలో జరగనున్న కబడ్డీ క్రీడా పోటీలకు గుండ్లపల్లి మండలం చేర్కుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధినీ ఇస్లావత్ మౌనిక ఎంపికయ్యారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇస్లావత్ మౌనిక అనే గిరిజన విద్యార్థిని ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్, ఎంఈఓ ఇస్లావత్ గోప్యా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో హెడ్మాస్టర్, ఎంఈఓ ఇస్లావత్ గోప్యా నాయక్ విద్యార్ధిని మౌనికను శాలువాతో సన్మానించారు.

అనంతరం విద్యార్థినీని ఉపాధ్యాయులంతా అభినందించి, రాష్ట్రస్థాయిలో గెలిచి నల్గొండ జిల్లాకు పేరును తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎంఈఓ గోప్యా నాయక్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ వి. శ్రీనివాస్, వేణు, లింగయ్య, సుజాత, లక్ష్మీ, శ్రీనివాస్, భూక్యా నాగేశ్వరరావు, శోభన్ బాబు, వాసవి, పుష్పలత, సిబ్బంది తదితరులు ఉన్నారు.