ఆదర్శ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Spread the love
  • మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
    010 పద్దు ద్వారా వేతనం చెల్లించాలి
  • హెల్త్‌ కార్డులు జారీ చేయాలి
  • ఉద్యోగ భద్రత కల్పించాలి

 

నేరేడుగొమ్ము, ఇలాకా: న్యాయమైన కోర్కెలు తీర్చాలనే డిమాండ్‌తో ఆదర్శపాఠశాలల ఉపాధ్యాయులు దశలవారీగా ప్రోగ్రెసివ్‌ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(పీఎంటీఏ) నాయకుల పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. మంగళవారం నేరేడుగొమ్ము మండల పరిధిలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నేనావత్ లాలు నాయక్ మాట్లాడారు. పదేళ్ల క్రితం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో నియమితులైన మోడల్ స్కూల్ టీచర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తం గా 194 మోడల్‌ స్కూళ్లలో 2,900 మంది ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఉద్యమబాట పట్టారని అన్నారు.

అనంతరం సీనియర్ అధ్యాపకుడు అజ్మీరా కోటేష్ నాయక్ ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ పదేళ్ల నుంచి కనీస ఉద్యోగభద్రత లేకుండా కొనసాగుతున్న మోడల్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం సానుకూలదృక్పథంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. యూపీఏ ప్రభుత్వహయంలో 2012లో మోడల్‌స్కూళ్లు ఏర్పాటయ్యాయని వివరించారు. స్కూ ళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక 2013లో నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయుల నియామకా లు చేశారని తెలిపారు. 2013లో కొందరికి, 2014లో మరికొందరికి సాంకేతికకారణాలతో వేర్వేరుగా నియామక ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 11 ఏళ్లు ఎలాంటి పదోన్నతులు, ఉద్యోగభద్రత లేకుండా మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరితో పాటే అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏపీలో నియమితులైన మోడల్‌ స్కూల్‌ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వేతనాలిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ కూడా అదే తరహాలో పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వేతనాలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

మోడల్‌స్కూల్‌ టీచర్లుగా ఒకే నోటిఫికేషన్‌ కింద నియమించినప్పటికీ, రెండోదశలో నియమితులైన వారికి కూడా నోషనల్‌ సర్వీస్‌, నోషనల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌కార్డులు అందజేయాలని కోరారు. వేర్వేరు కారణాలతో ఈ 11 ఏళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38మంది మృతిచెందగా, వారి స్థానంలో వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వాలని, వారికి సంబంధించిన సీపీఎస్‌, డెత్‌ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పింఛన్‌ వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. 11 ఏళ్లుగా పదోన్నతులు లేవని, వెంటనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌ బకాయిల తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రాజ్యాలత, గణేష్, రెహానా బేగం, చందు, శిరీష, పీడీ శ్రీను నాయక్, ఇతర అతిథి అధ్యాపక బృదం పాల్గొన్నారు.