మరికాసెపట్లో దాయాదుల సమరం

Spread the love
దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్
సెమీస్ బెర్త్‌పై కన్నేసిన టీమిండియా
ప్రతీకారానికి సిద్ధమైన రోహిత్ సేన
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

దుబాయ్: ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో నేడు చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా.. తొలి మ్యాచ్‌లో ఓడిన పాక్ మాత్రం భారత్‌తో మ్యాచ్‌ను గెలిచి పరువు నిలుపుకోవడంతో పాటు సెమీస్ ఆశలు నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది.

 

అన్ని విభాగాల్లో పటిష్టంగా..

నేడు జరగనున్న మ్యాచ్‌లో పాక్‌తో పోలిస్తే టీమిండియా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ శుభారంభాలు అందిస్తుండగా.. కోహ్లీ, అయ్యర్, రాహుల్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో బుమ్రా లేని లోటును మహ్మద్ షమీ పూడుస్తున్నాడు. బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సంగతి తెలిసిందే. హర్షిత్ రానా పరుగులు భారీగా ఇచ్చినప్పటికీ బౌలింగ్‌తో ఆకట్టకున్నాడు. కుల్దీప్ రాణించకపోవడంతో అతడి స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశముంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

 

పేలవమైన బ్యాటింగ్..

మరోవైపు పాకిస్థాన్ మాత్రం బ్యాటింగ్‌లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 320 పరుగులు ఛేదించే క్రమంలో బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64 పరుగులు) చేయడం విమర్శలకు దారి తీసింది. మిడిలార్డర్‌లో ఖుష్‌దిల్ షా అటాకింగ్ ఆటతో ఆకట్టుకున్నప్పటికీ అతనికి సహకరించేవారు కరువయ్యారు. బౌలింగ్‌లో పాక్ ఎప్పటికీ ప్రమాదకరమే. ముఖ్యంగా భారత్ అంటే చెలరేగిపోయే షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలు కీలకంగా మారనున్నారు.

 

ఐసీసీ టోర్నీల్లో భారత్‌దే పైచేయి..

1990 నుంచి ఇప్పటివరకు ఐసీసీ వన్డే టోర్నీల్లో భారత్‌ను పాక్ ఓడించిన దాఖలాలు లేవని గత రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్ మధ్య 21 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 16 సార్లు నెగ్గితే, పాక్ ఐదుసార్లు మాత్రమే గెలిచింది. ఇక వన్డే వరల్డ్‌కప్స్‌లో భారత్ 8 పాక్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. టీ20 ప్రపంచకప్‌ల్లో 8 సార్లు తలపడితే భారత్ ఆరుసార్లు.. పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాకిస్థాన్ 3 భారత్‌పై ఆధిక్యంలో నిలవడం గమనార్హం. ఈ రెండుజట్లు చివరిసారిగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తలపడితే భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవడం విశేషం.