-బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం
-శతకంతో చెలరేగిన రచిన్ రవీంద్ర
-ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు కథ ముగిసింది. గ్రూప్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్ ఇంటిబాట పట్టనుంది. రావల్పిండి వేదికగా సోమవారం గ్రూప్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బంగ్లా విధించిన 237 పరుగుల టార్గెట్‌ను కివీస్ జట్టు మరో 23 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి గెలుపు అందుకుంది. రచిన్ రవీంద్ర వీరోచిత శతకంతో జట్టును గెలిపించగా.. మైకెల్ బ్రాస్‌వెల్ తన బౌలింగ్‌తో బంగ్లాను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో బంగ్లాను ఓడించి దర్జాగా సెమీస్‌కు చేరుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
అదరగొట్టిన బ్రాస్‌వెల్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బంగ్లాకు ఓపెనర్లు తంజిద్ హసన్ (24), కెప్టెన్ నజ్ముల్ షాంటో (77) శుభారంభం అందించారు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. అయితే లోయర్ ఆర్డర్‌లో జాకర్ అలీ (45), రిషద్ హొసెన్ (26) రాణించడంతో బంగ్లా 200 పరుగుల మార్క్‌ను దాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో మైకెల్ బ్రాస్‌వెల్ 4 వికెట్లు తీయగా.. విలియం రూర్కీ 2, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ చెరొక వికెట్ తీశారు.
రచిన్ శతక నాధం
సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే కేన్ విలియమ్సన్ (5) తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. ఈ దశలో డెవన్ కాన్వే (30)కు జత కలిసిన రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కాన్వే ఔట్ అనంతరం టామ్ లాథమ్‌తో కలిసి రచిన్ రవీంద్ర నాలుగో వికెట్‌కు 129 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో తొలి శతకం సాధించిన రచిన్ దీనితో కలిపి ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో నాలుగు సెంచరీలు బాదడం విశేషం. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చేయాల్సిన పరుగులు తక్కువే ఉండడంతో గ్లెన్ ఫిలిప్స్ (21 నాటౌట్), బ్రాస్‌వెల్ (11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో రిషద్, నహిద్, తస్కిన్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. న్యూజిలాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న భారత్‌తో ఆడనుంది. ఆదివారం పాక్‌పై విజయంతో టీమిండియా ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే