-ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు
-ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయింపు
-ఆఫ్గన్‌పై గెలిస్తేనే రేసులో ఇంగ్లండ్
-ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
రావల్పిండి: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి వరుణుడు ఆధిపత్యం ప్రదర్శించాడు. మంగళవారం రావల్పిండి వేదికగా గ్రూప్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. ఉదయం నుంచి భారీగా కురుస్తున్న వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడం గ్రూప్ నుంచి ఏ జట్టు సెమీస్ చేరుతుందన్నది ఇంకా ఖరారు కాలేదు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. తమ చివరి మ్యాచ్‌ను సౌతాఫ్రికాతో ఆడనున్న ఇంగ్లండ్ అందులో కూడా గెలిస్తే 4 పాయింట్లతో నిలుస్తుంది. అదే సమయంలో సఫారీలు 3 పాయింట్లతోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తోంది.
కంగారూలకు కలసిరాని వర్షం..
మరోవైపు ఆస్ట్రేలియా కూడా 3 పాయింట్లతో ఉన్నప్పటికీ చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఓడిస్తే సెమీస్‌లో అడుగుపెడుతోంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడితే మాత్రం కంగారూలు ఇంటిబాట పట్టనుంది. అయితే కంగారూలకు చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కలిసి రాలేదు. గత చాంపియన్స్ ట్రోఫీల్లో ఆస్ట్రేలియా ఆడిన ఎనిమిది సందర్భాల్లోనూ వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడమో లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించడమో జరుగుతూ వచ్చింది. మరి ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ దానిని మారుస్తుందేమో చూడాలి. చోకర్స్‌గా ముద్రపడిన సౌతాఫ్రికాకు బ్యాడ్‌లక్ దగ్గరగా ఉంటుంది. ఎన్నోసార్లు వరుణుడు వారి విజయాలను లాగేసుకున్నాడు. ఒకవేళ ఆసీస్‌తో మ్యాచ్‌లో గెలిచి ఉంటే సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టేదే. కానీ వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దవడం.. తమ చివరి మ్యాచ్‌ను పటిష్టమైన ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉండడం జట్టును కలవరపెడుతోంది. ఇంగ్లండ్‌పై గెలిస్తేనే సఫారీలు సెమీస్‌లో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఈ ఆదివారం తలపడనున్నాయి. మరోవైపు టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య పోరు నామమాత్రంగా మారిపోయింది.