70 తులాల బంగారం, 1.5 లక్షల నగదు చోరీ
24 గంటల్లో కేసును చేదించిన పోలీసులు
అయిదుగురిపై కేసు నమోదు
హుజురాబాద్ : హుజురాబాద్‌లోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం అర్థరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి 70 తులాల బంగారంతో పాటు 1.5 లక్షలు నగదు దోచుకెళ్లారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కన్న కొడుకే తండ్రి ఆస్తి కోసం పథకం ప్రకారం దొంగతనం చేయించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. రాఘవరెడ్డికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు నాగరాజు, అతని భార్యశాలిని కలిసి తండ్రి వద్ద ఉన్న బంగారం, ధనం కాజేసేందుకే కుట్ర పన్నారు. నాగరాజు హోటల్లో పనిచేసే అమీర్ సాయంతో పథకాన్ని అమలు చేయాలనుకున్నారు. అమీర్ తన బంధువు సమీర్ ని, అతని స్నేహితులైన మున్నా, కృష్ణలతో కలిసి దొంగతనం చేయాలని పథకం వేశారు. ఆదివారం సాయంత్రం ప్రాంతంలో నాగరాజు నిర్వహించే హోటల్ లో సమీర్, మున్నా, కృష్ణ కలుసుకుని సుపారి మాట్లాడుకున్నారు.
అనుమానం రాకూడదని..
పథకం ప్రకారం నలుగురు అదేరోజూ రాత్రి నాగరాజు ఇంటికి చేరుకున్నారు. తనపై ఎలాంటి అనుమానం రాకూడదని నాగరాజు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాడు. వాళ్ల పథకంలో భాగంగా అమీర్ రాఘవ రెడ్డి ఇంటి ముందు ఉన్న మోటార్ ఆన్ చేసి వెళ్ళాడు. మోటర్ ఆఫ్ చేయడానికి రాఘవరెడ్డి భార్య వినోద బయటకు రాగా ఆమెపై దాడి చేసి ఇంట్లోకి వెళ్లారు. రాఘవరెడ్డి అతని కూతురు మానసలపై కూడా దాడి చేసి ఇంట్లో దాచి ఉంచుకున్న ౭౦ తులాల బంగారం, 1.5 లక్షల డబ్బు తీసుకొని పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ కరీంనగర్ నుంచి డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో కలిపి మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నాగరాజు మీద అనుమానంతో అదుపులో తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. 24 గంటల్లోనే పోలీసులు కేసును చేదించి నిందితులను పట్టుకోవడంతో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జితో పాటు టౌన్ సీఐ తిరుమల్ గౌడ్, ఎస్ ఐ మహమ్మద్ యూనస్ అలీ, సీసీఎస్ టీం సిబ్బంది సురేందర్ పాల్, సాయి అవినాష్, టెక్ టీం సిబ్బంది ప్రదీప్, సంతోష్ తోపాటు సిబ్బందిని అభినందించారు.