– వర్షం కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
– గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు
– నేడు ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ కీలకమ్యాచ్
– ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
రావల్పిండి: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు గెలుపు రుచి చూడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం గ్రూప్ రావల్పిండి వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. రావల్పిండిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గుచూపారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తాము ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడంతో సెమీస్‌కు దూరమయ్యాయి. ఇక గ్రూప్ నుంచి ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరగనున్న మ్యాచ్ నామమాత్రమే. అయితే లీగ్ దశలో ఓటమి లేకుండా గ్రూప్ ఎవరు సెమీస్‌లో అడుగుపెడతారన్నది ఆసక్తిగా మారింది.
ఆస్ట్రేలియాకు ఆఫ్గన్ షాక్ ఇచ్చేనా?
మరోవైపు గ్రూప్ ఇప్పటివరకు సెమీస్ బెర్తు ఖరారు కాలేదు. ఇంగ్లండ్ మినహా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ఉన్నాయి. నేడు లాహోర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆసీస్ విజయం సాధిస్తేనే నాకౌట్‌లో అడుగుపెడుతుంది. అయితే ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన ఆఫ్గన్ ఆస్ట్రేలియాపై కూడా అదే ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతోంది. గత వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్గన్ ఆసీస్‌ను ఓడించినంత పని చేసింది. అయితే ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ వీరోచిత పోరాటంతో ఆసీస్ విజయాన్ని అందుకుంది. ఈసారి ఆఫ్గన్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.