- సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం
- కోహ్లీ, అయ్యర్, రాహుల్ మెరుపులు
- రాణించిన షమీ, వరుణ్ చక్రవర్తి
- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి కంగారులను నాకౌట్ దశలోనే వాకౌట్ చేయించింది. చేజింగ్ మాస్టర్‌గా పేరొందిన కింగ్ కోహ్లీ మరోసారి తన పాత్రను సమర్థంగా పోషించగా.. అయ్యర్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వెరసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఐదోసారి ఫైనల్లో అడుగుపెట్టనుంది. నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో మార్చి 9న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ విలువైన ఇన్నింగ్స్‌కు తోడు అయ్యర్, రాహుల్ సొగసైన బ్యాటింగ్ భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61) అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసి గెలుపొందింది. కోహ్లీ (98 బంతుల్లో 84; 5 ఫోర్లు), అయ్యర్ (62 బంతుల్లో 45) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, నాథన్ ఎలిస్ చెరో 2 వికెట్లు తీశారు. బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం టీమిండియాతో టైటిల్ పోరకు సిద్ధమవనుంది.
కోహ్లీ కమాల్..
టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర విరాట్ కోహ్లీదే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఇవాళ ఆసీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. బంతి స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై కోహ్లీ ఆడిన తీరు ఆకట్టకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌తో కలిసి శతక పరుగుల భాగస్వామ్యం నిర్మించి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు మాత్రమే వచ్చినప్పటికీ ఎక్కువ సింగిల్స్, డబుల్స్ తీయడం విశేషం. చేజింగ్ మాస్టర్ అని ఎందుకంటారనేది కోహ్లీ మరోసారి నిరూపించాడు.
మ్యాచ్ హైలైట్స్..
- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను నాకౌట్ దశలో ఇంటిబాట పట్టించడం టీమిండియాకు ఇది మూడోసారి. గతంలో 1998, 2000 చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌ను క్వార్టర్స్‌లోనే ఓడించడం గమనార్హం.
- ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10) అగ్రస్థానంలో ఉండగా.. మెక్‌గ్రాత్ (8), రోహిత్ శర్మ (8) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
- ఐసీసీకి సంబంధించిన అన్ని టోర్నీల్లోనూ భారత్‌ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్ చేర్చాడు.