భారత్‌తో న్యూజిలాండ్ అమీతుమీ

Spread the love

  • చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు కివీస్
  • సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
  • శతకాలతో చెలరేగిన విలియమ్సన్, రచిన్ రవీంద్ర
  • మిల్లర్ మెరుపు సెంచరీ వృథా
  • మార్చి 9న టైటిల్ పోరు

లాహోర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం లాహోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) శతకాలతో చెలరేగారు. సఫారీ బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు తీయగా.. రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులకు పరిమితమైంది. మిల్లర్ (100 నాటౌట్), డసెన్ (69), బవుమా (56) రాణించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 , హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా న్యూజిలాండ్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో 25 ఏళ్ల తర్వాత భారత్ కివీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించింది.

అటు కేన్ మామ.. ఇటు రవీంద్ర

టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న న్యూజిలాండ్ ఆది నుంచి దూకుడు మంత్రం జపించింది. ఓపెనర్ విల్ యంగ్ (21) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్‌తో కలిసి రచిన్ రవీంద్ర కివీస్ స్కోరును పరిగెత్తించాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు శతకాలు సాధించారు. రచిన్ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ (37 బంతుల్లో 49) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అనంతరం గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కివీస్ 350 పరుగుల మార్క్‌ను దాటింది.

సరిపోని మిల్లర్ మెరుపులు

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. రికెల్ టన్ (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ బవుమా, డుసెన్‌లు కలిసి ఇన్నింగ్స్ నడిపించినప్పటికీ రన్‌రేట్ పెరిగిపోవడంతో ఒత్తిడి పెరిగిపోయింది. అర్థసెంచరీలు సాధించిన అనంతరం ఈ ఇద్దరు ఔటయ్యారు. అయితే మిడిలార్డర్‌లో మార్క్రరమ్ (31) మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. డేవిడ్ మిల్లర్ అజేయ మెరుపు సెంచరీతో సాధించినప్పటికీ చేధించాల్సిన లక్ష్యం చాలా ఉండడం.. సరైన బ్యాటర్లు లేకపోవడంతో సఫారీలు ఓటమి పాలయ్యారు.

  • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. అత్యధికసార్లు ఫైనల్ చేరిన జట్టుగా కివీస్.. విండీస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో భారత్ (5) ఉంది.
  • ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా సెమీస్‌లో ఇంటిబాట పట్టడం ఇది తొమ్మిదోసారి. వన్డే చరిత్రలో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు సెమీస్‌లో ఓడిపోలేదు. సఫారీల తర్వాత కివీస్ (13 మ్యాచ్‌ల్లో 8 సార్లు) సెమీస్‌లో వెనుదిరిగింది.
  • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన తొలి ఆటగాడిగా మిల్లర్ (67 బంతులు) రికార్డులకెక్కాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ (77 బంతులు), జోస్ ఇంగ్లిస్ (77 బంతులు), శిఖర్ ధావన్ (80 బంతులు), దిల్షాన్ (87 బంతులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.