- ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
- మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టీమిండియా సొంతం
- రోహిత్ అర్థశతకం.. మెరిసిన అయ్యర్
- గెలిపించిన రాహుల్, జడేజా

దుబాయ్, మార్చి 9: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో బ్రాస్‌వెల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా.. షమీ, జడేజా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి గెలుపొందింది. భారత బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్ (48) విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ఉత్కంఠ చెలరేగినప్పటికీ కేఎల్ రాహుల్ (34 నాటౌట్), జడేజా (18 నాటౌట్) జట్టును గెలిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ అందుకున్న భారత్ అదే సమయంలో 25 ఏళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి కూడా కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. గతంలో 2002లో లంకతో సంయుక్త విజేతగా నిలిచిన భారత్.. 2013లో ధోనీ నేతృత్వంలో రెండోసారి టైటిల్ అందుకుంది. తాజాగా రోహిత్ సారధ్యంలోని టీమిండియా హ్యాట్రిక్ టైటిల్ సాధించడం విశేషం.
కట్టడి చేసిన స్పిన్నర్లు..
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్ ఓపెనర్లు విల్ యంగ్ (15), రచిన్ రవీంద్ర (37) తొలి వికెట్‌కు 7.5 ఓవర్లలో 57 పరుగులు జోడించి శుభారంభం అందించారు. షమీ, పాండ్యా బౌలింగ్‌ను ఉతికారేయడంతో రోహిత్ బంతిని స్పిన్నర్లకు అప్పగించాడు. దీంతో వ్యూహం ఫలించింది. 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డారిల్ మిచెల్ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం గగనమైంది. ఒక దశలో 69 బంతుల దాకా ఒక్క బౌండరీ రాలేదు. మిడిలార్డర్‌లో ఫిలిప్స్ (34)తో కలిసి పరుగులు సాధించి కివీస్‌ను ఆదుకున్నాడు. డారిల్ మిచెల్ ఔటైన తర్వాత గేర్ మార్చిన బ్రాస్‌వెల్ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరును 250 దాటించాడు.
రోహిత్ ప్రారంభించాడు.. రాహుల్ ముగించాడు
టోర్నీలో తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ ఫైనల్ మ్యాచ్‌లో తన అసలైన ఆటను ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన రోహిత్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్‌తో కలిసి వందకు పైగా పరుగులు జోడించి బలమైన పునాది వేశాడు. అయితే బంతి స్పిన్నర్ల చేతికి వెళ్లిన తర్వాత ఆట పూర్తిగా మారిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్‌తో గిల్ (31) వెనుదిరగ్గా.. ఆ వెంటనే కోహ్లీ (1) బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ దశలో రోహిత్‌కు జత కలిసిన అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగించాడు. పరుగులు రావడం కష్టమైనప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. సాఫీగా సాగుతున్న మ్యాచ్‌లో రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (29) చక‍్కని ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌కు పెద్దగా ఇబ్బంది కలగలేదు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో కాస్త ఉత్కంఠ ఎదురైంది. ఈ దశలో పాండ్యా (18, 1 ఫోర్, 1 సిక్సర్) ఒత్తిడి తగ్గించి భారత్‌ను విజయానికి దగ్గర చేశాడు. ఆఖర్లో కేఎల్ రాహుల్, జడేజా కలిసి లాంచనాన్ని పూర్తి చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకోగా.. రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు.