కోల్‌కతా సునాయాసంగా

Spread the love
  • రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం
  • డికాక్ మెరుపులు.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన
  • విఫలమైన రాజస్థాన్ బ్యాటర్లు


గౌహతి, మార్చి 26: ఐపీఎల్ 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయంతో మెరిసింది. బుధవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో డికాక్ మెరుపులతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జైస్వాల్ (29) పర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, మోయిన్ అలీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (97 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. హసరంగా ఒక వికెట్ పడగొట్టాడు. తొలి విజయంతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

స్పిన్నర్ల జోరు.. రాజస్థాన్ బేజారు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభం నుంచే ఏదీ కలిసి రాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన శాంసన్ (13) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ (25)తో కలిసి జైస్వాల్ (29) ఇన్నింగ్స్ నడిపించాడు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరు 34 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్లు మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను కష్టాల్లోకి నెట్టారు. చివర్లో ధ్రువ్ జురేల్, జోప్రా ఆర్చర్ (16) కాసేపు పోరాడడంతో జట్టు స్కోరు 150 దాటింది.

దంచికొట్టిన డికాక్

అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. మోయిన్ అలీ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ డికాక్ చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రహానే (18) సహకారంతో కేకేఆర్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఆఖర్లో రహానే ఔటైనప్పటికీ అంగ్‌క్రిష్ రఘువంశీ (22 నాటౌట్)తో కలిసి డికాక్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన డికాక్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. డికాక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.