– 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి
– దంచికొట్టిన పూరన్, మార్ష్
– 4 వికెట్లతో చెలరేగిన శార్దూల్
– నేడు చెన్నైతో బెంగళూరు ‘ఢీ’
హైదరాబాద్, మార్చి 27: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయాన్ని అందుకుంది. పూరన్ పూనకానికి తోడు మార్ష్ విధ్వంసం జతవ్వడంతో లక్నో మరో 23 బంతులుండగానే లక్ష్యాన్ని అందుకొని సీజన్‌లో తొలి గెలుపు సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హెడ్ (47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ (36) ఆకట్టుకున్నాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు మిచెల్ మార్ష్ (52) అర్థసెంచరీ సాధించాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (22*), మిల్లర్ (13*) జట్టును విజయతీరాలకు చేర్చారు. కమిన్స్ రెండు వికెట్లు తీశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ను దెబ్బకొట్టిన శార్దూల్ ఠాకూర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. నేడు చెన్నై వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
‘సన్‌రైజ్’ అవ్వని బ్యాటర్లు..
టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఏంచుకోవడంపై అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తమకు అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్న సన్‌రైజర్స్ మరోసారి పండుగ చేసుకుంటారని అంతా భావించారు. కానీ బలమైన బ్యాటింగ్ కలిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈసారి రైజ్ అవ్వలేదు. అభిషేక్ శర్మ (6) మరోసారి విఫలమవ్వగా.. గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్ కావడం ఎస్‌ఆర్‌హెచ్ కొంపముంచింది. అయితే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 47, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కాస్త వేగంగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్ 10.2 ఓవర్లలో వంద పరుగుల మార్క్‌ను దాటింది. అయితే క్లాసెన్ (22) రనౌట్ కావడంతో 110 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన నితీశ్ కుమార్ (32) ధాటిగా ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో 128 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన రైజర్స్‌ను అనికేత్ వర్మ ఆదుకున్నాడు. ఐదు సిక్సర్లు బాదిన అనికేత్ 38 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాట్ కమిన్స్ (18) హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. చివర్లో హర్షల్ పటేల్ (12 నాటౌట్) జట్టును ఆలౌట్ బారీ నుంచి రక్షించాడు.