కాటేరమ్మా.. ఇదీ పోయిందమ్మా

Spread the love
  • సన్ రైజర్స్‌కు వరుసగా నాలుగో పరాజయం
  • ఫాఫం కావ్యా పాపను కనికరించండ్రా అయ్యా..
  • ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున హైదరాబాద్
  • ‘ఇంపాక్ట్’ చూపని సిమర్‌జీత్
  • ముంచిన హైదరాబాదీ సిరాజ్
  • మరో‘సారీ’ తేలిపోయిన బ్యాటింగ్
  • షరామామూలుగా సత్తా చాటని బౌలర్లు

కాటేరమ్మ కొడుకులు.. మెంటల్ నా కొడుకులు.. 300 పక్కా.. ఆ‘రేంజ్’ ఆర్మీ ఊచకోతకు అవతలి జట్టు బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం అని సీజన్‌కు ముందు ప్రతి ఒక్కరూ అన్నారు. అన్నట్టుగానే మొదటి మ్యాచ్‌లో మన బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఇక సీజన్ మొత్తం ఆ‘రేంజ్’ కనిపిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.. తర్వాత మ్యాచ్ నుంచి కాటేరమ్మ కొడుకులు కొట్టలేక చేతులెత్తేస్తున్నారు. షరామామూలుగా బౌలర్లు కూడా బ్యాటర్ల దారిలోనే పయనిస్తున్నారు. కావ్యా పాప పరిస్థితి చూసి అంతా అయ్యో పాపం! అంటున్నారు. ఇకనైనా గెలవండ్రా అని ప్లేయర్లను వేడుకుంటున్నారు..

హైదరాబాద్, ఏప్రిల్ 6: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకున్న కమిన్స్ సేన ఆదివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సుందర్‌కు తోడు కెప్టెన్ గిల్ (61*) అర్ధ సెంచరీ సాధించడంతో గుజరాత్ గెలుపు సులువయింది. గుజరాత్ మరో 20 బంతులు మిగులుండగానే విజయఢంకా మోగించింది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ వరుసగా నాలుగు పరాజయాలు చవి చూసింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్న హైదరాబాద్ ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. హైదరాబాదీ బౌలర్ సిరాజ్ 4 వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ నడ్డి విరిచాడు.

టాప్ ఆర్డర్ మరో ‘సారీ’

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆరెంజ్ ఆర్మీ టాపార్డర్ మరోసారి విఫలమైంది. గుజరాత్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు హెడ్ (8), అభిషేక్ శర్మ (18) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. మొదటి ఓవర్లోనే రెండుఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన హెడ్ అదే ఓవర్ చివరి బంతికి మిడివికెట్ రీజియన్‌లో సాయిసుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలమయ్యాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (31) కొద్ది సేపు పోరాడినా కానీ అతడి పోరాటం ఏమాత్రం సరిపోలేదు. క్లాసెన్ (27) బ్యాట్ ఝలిపించే ప్రయత్నంలో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనికేత్ వర్మ (18), కమిందు మెండిస్ (1) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే చివర్లో కెప్టెన్ కమిన్స్ (22*) (9 బంతుల్లో) చెలరేగడంతో హైదరాబాద్ 150 స్కోరు క్రాస్ చేసింది.

టెర్రర్ బౌలింగ్

మొదటినుంచీ ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ వీక్ అనే విమర్శ ఉంది. 250+ స్కోర్ చేస్తేనే మన బౌలర్లు ఆ టోటల్‌ను డిఫెండ్ చేస్తారా? లేదా అనే అనుమానం ఉన్న వేళ.. 152 అంటే ఓటమి పక్కా అని ఆరెంజ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకు తగిన విధంగానే మనోళ్లు బౌలింగ్‌లో మరోసారి తేలిపోయారు. ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ (49) (29 బంతుల్లో) కొట్టాడంటేనే మన బౌలింగ్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌ను సుందర్ ఊచకోత కోశాడు. నేడు ముంబై ఇండియన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

ఫాఫం పాప

మ్యాచ్ జరుగున్నంత సేపు కెమెరామెన్, ఆడియన్స్ కళ్లన్నీ ‘కావ్య’ పాప మీదే ఉన్నాయి. మన బ్యాటర్ల కంటే ఎక్కువ సేపు కావ్యాపాపే స్క్రీన్ మీద కనిపించింది. గుజరాత్ ఫోర్ కొట్టిన ప్రతిసారి దీనంగా చూస్తూ పాప పలికించిన హావాభావాలు అందర్నీ కలిచివేశాయి. పోయినేడాది బ్యాటింగ్‌లో రెచ్చిపోయి రేంజు చూపించిన ఆరెంజ్ ఆర్మీ ఈ సారి మాత్రం వరుసగా చతికిలపడుతూ వస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకున్న ఎస్‌ఆర్‌ఎచ్ మరో మ్యాచ్‌లో కూడా ఓడిపోయి అట్టడుగు స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఆరెంజ్ ఆర్మీ కనీసం కావ్యాపాప కోసమైనా గెలవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. మరి కాటేరమ్మ కొడుకులు ఏం చేస్తారో చూడాలి..