సెమీస్ ఆశలు సజీవం
ఇంటిదారి పట్టిన ఇంగ్లండ్
ఇబ్రహీం జర్దన్ వీరోచిత సెంచరీ
రూట్ శతకం వృథా.. అజ్మతుల్లాకు 5 వికెట్లు

లాహోర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పెను సంచలనం నమోదైంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతులెత్తేయగా.. విజయంతో ఆఫ్గన్ సెమీస్ రేసులో నిలిచింది. బుధవారం లాహోర్ వేదికగా గ్రూప్ ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఫలితంగా ఇంగ్లండ్ ఆడిన రెండింటిలోనూ ఓటమి పాలై సెమీస్ రేసు నుంచి తప్పుకోగా.. ఆఫ్గన్ ఒక మ్యాచ్‌లో ఓడి మరొక మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లతో రేసులో నిలిచింది. శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దంచికొట్టిన ఇబ్రహీం జర్దన్
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జర్దన్ (146 బంతుల్లో 177; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా (40), అజ్మతుల్లా (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. లివింగ్‌స్టోన్ 2 వికెట్లు పడగొట్టాడు.
రూట్ సెంచరీ చేసినా
326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (111 బంతుల్లో 120; 11 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో అలరించినప్పటికీ.. మిగతావారు అతడికి సహకరించడంలో విఫలమయ్యారు. కాగా రూట్ 2019 తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించడం ఇదే. రూట్ సెంచరీ సాధించడానికి 37 ఇన్నింగ్స్‌లు తీసుకోవడం గమనార్హం. మిడిలార్డర్‌లో కెప్టెన్ బట్లర్ (38), ఓవర్టన్ (32) రాణించినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడంతో ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనించింది. ఆఖర్లో ఆర్చర్ (8 బంతుల్లో 14) ఆశలు రేపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఫ్గన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జెయ్ 5 వికెట్లతో మెరవగా.. నబీ 2 వికెట్లు తీశాడు.
సెమీస్ చేరేదెవరు?
ఆఫ్గన్ విజయంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ రేసు నుంచి వైదొలగడంతో ఆసీస్, సౌతాఫ్రికా, ఆఫ్గన్‌ల మధ్య ట్రయాంగిల్ పోరు నెలకొంది. అయితే ఆసీస్ చేతిలో ఆఫ్గన్, సౌతాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఓడితే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే కంగారూలు, సఫారీలు సెమీస్‌లో అడుగుపెట్టనున్నారు. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఆసీస్ ఓడి.. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ గెలిస్తే మెరుగైన రన్‌రేట్‌తో ఆఫ్గన్, సౌతాఫ్రికా సెమీస్ చేరనున్నాయి. దీంతో సౌతాఫ్రికా కంటే ఆస్ట్రేలియాకు ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది. గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.