సఫారీల చేతిలో అఫ్గానిస్థాన్ చిత్తు

Spread the love
  • 107 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
  • శతకంతో చెలరేగిన రికెల్‌టన్
  • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

కరాచీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికా జట్టు ఘనంగా ఆరంభించింది. కరాచీ వేదికగా గ్రూప్ శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 107 పరుగులతో ఘన విజయాన్ని సాధించారు. తొలుత బ్యాటింగ్‌లో చేలరేగిన సఫారీలు అనంతరం బౌలింగ్‌లో అఫ్గాన్‌ను చెడుగుడు ఆడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ రికిల్‌టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. బవుమా (58), డసెన్ (52), మార్క్రరమ్ (52) అర్థసెంచరీలు సాధించారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు తీయగా.. ఫజల్లా ఫరూకీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడ 3 వికెట్లు తీయగా.. ఎన్గిడి రెండు, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ చెరొక వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన రికెల్‌టన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకున్నాడు.

దుమ్మురేపిన రికెల్‌టన్..
దక్షిణాఫ్రికా బ్యాటర్ రికిల్‌టన్ ఓపెనర్‌గా వచ్చి అద్భుత శతకంతో మెరిశాడు. ఆరంభం నుంచే నిలకడగా ఆడిన రికెల్‌టన్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే కెరీర్‌లో తొలి శతకం సాధించిన రికెల్‌టన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా తరఫున సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. గతంలో హర్షలే గిబ్స్ మూడు సెంచరీలు చేయగా.. స్మిత్, కలిస్, ఆమ్లా తలా ఒక సెంచరీ బాదారు. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో నాలుగు అర్థసెంచరీలు నమోదయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీలో సఫారీ జట్టు తరఫున వేగవంతమైన అర్థశతకం సాధించిన ఆటగాడిగా మార్కరమ్ నిలిచాడు. మార్కరమ్ ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా 300కు పైగా స్కోరు చేయడం ఇది నాలుగో సారి.

అఫ్గానిస్థాన్ చెత్త రికార్డు
మ్యాచ్‌లో ఓటమిపాలైన అఫ్గానిస్థాన్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఐసీసీ వన్డే టోర్నీల్లో వందకు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం ఇది ఐదో సారి. ఇక 2022 నుంచి చూసుకుంటే 250 లోపు లక్ష్యాలను 9 సార్లు (10 మ్యాచ్‌ల్లో) ఛేదించిన ఆఫ్గన్.. 250 ప్లస్ స్కోర్లను కేవలం రెండు సార్లు (12 మ్యాచ్‌ల్లో) మాత్రమే అందుకొని చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇక వన్డేల్లో సెంచరీకి దగ్గరగా వచ్చి తొంబైల్లో ఔటైన అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో రహమత్ షా రెండుసార్లు చోటు దక్కించుకున్నాడు. గతంలో 2022లో జింబాబ్వేతో మ్యాచ్‌లో రహమత్ షా 94 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక నేడు జరగనున్న గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.