– వర్షం అంతరాయంతో మ్యాచ్ రద్దు
– ఆఫ్గన్ 273 ఆలౌట్.. ఆసీస్ 12.5 ఓవర్లలోనే 109/1
– ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
లాహోర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం గ్రూప్ లాహోర్ వేదికగా అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలి ఇన్నింగ్స్ సాఫీగా సాగినప్పటికీ.. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. మధ్యలో ఆగినట్లే ఆగి మళ్లీ జోరందుకోవడంతో ఆట సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించగా.. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌కు సెమీస్ ఆశలు ఇంగ్లండ్ విజయంపై ఆధారపడి ఉన్నాయి. గ్రూప్‌లో సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ తేడాతో విజయం సాధిస్తేనే ఆఫ్గన్‌కు ఆశలు ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇంగ్లండ్ పేలవ ఆటతీరు కనబరుస్తుండగా.. సఫారీలు మంచి ఫామ్‌లో ఉండడం గమనార్హం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆఫ్గన్ సెమీస్ చేరడం అసాధ్యం.
రాణించిన సెదికుల్లా, అజ్మతుల్లా
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. లాస్ట్ మ్యాచ్ హీరో ఇబ్రహీం జర్దాన్ (22) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన సెదికుల్లా అటల్ (95 బంతుల్లో 8 5; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడగా.. మిడిలార్డర్‌లో అజ్మతుల్లా (63 బంతుల్లో 67; 1 ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్‌సుయిస్ 3 వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సన్, జంపా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
హెడ్ దనాధన్..
274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి 12.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ఆది నుంచి ఎదురుదాడికి దిగిన ఆసీస్ ఓవర్‌కు 9కి పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) దనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు.
అఫ్గానిస్థాన్ సెమీస్ చేరాలంటే..
చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్ సెమీస్ చేరడం అసాధ్యమైనప్పటికీ వారికి ఒక అవకాశముంది. అదెలాగంటే ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా భారీ తేడాతో ఓడిపోవాలి. ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. సౌతాఫ్రికాపై 207 పరుగులకు పైగా తేడాతో విజయాన్ని అందుకోవాలి.. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ ఆడితే సఫారీలు విధించిన లక్ష్యాన్ని 11.1 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించి.. ఆ తర్వాత సఫారీలను తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే ఏమైనా అవకాశాలుంటాయి. కరాచీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే మాత్రం సౌతాఫ్రికా సెమీస్‌కు వెళ్లనుంది.