– 25 పరుగులతో చెన్నై పరాజయం – మరో మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి – నేడు గుజరాత్‌తో హైదరాబాద్ ‘ఢీ’
చెన్నై/ముల్లన్‌పూర్, ఏప్రిల్ 5: ఐపీఎల్ 18వ సీజన్‌లో శనివారం డబుల్ హెడర్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించాయి. శనివారం చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయాన్ని సాధించి హ్యాట్రిక్ గెలుపు అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థసెంచరీతో రాణించాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులకు పరిమితమైంది. విజయ్ శంకర్ (69 నాటౌట్), ధోని (30 నాటౌట్) మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ 2 వికెట్లు తీశాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనింగ్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. అభిషేక్ పొరేల్, అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు జోడించాడు. చివర్లో స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్) భారీ షాట్లు కొట్టడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడిన చెన్నై ఆదిలోనే రచిన్ రవీంద్ర (3), రుతురాజ్ (5) వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో వచ్చిన విజయ్ శంకర్ అర్థసెంచరీతో రాణించినప్పటికీ బంతులు ఎక్కువగా వృథా చేయగా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. ధోని ఆఖర్లో కాసేపు ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా 3 మ్యాచ్‌ల్లో నెగ్గి పట్టికలో టాప్ స్థానంలో నిలవగా.. సీఎస్కే మాత్రం హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది. కేఎల్ రాహుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.
రాజస్థాన్‌దే గెలుపు..
ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగులు తేడాతో గెలుపొందింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థశతకంతో ఆకట్టుకోగా.. పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్) మెరిశాడు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నిహాల్ వధేరా (41 బంతుల్లో 62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ (30) మినహా మిగతావారు విఫలమవ్వడం పంజాబ్‌ను దెబ్బకొట్టింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మెరవగా.. పొదుపుగా బౌలింగ్ చేసిన సందీప్ శర్మ, మహీశ్ తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకోగా.. పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో నిలిచింది. ఉప్పల్ వేదికగా నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.