ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

Spread the love
–  డబ్ల్యూపీఎల్- 2025 దంచికొట్టిన షఫాలీ, జొనాస్సెన్
– గుజరాత్‌పై వరుసగా నాలుగో గెలుపు

బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో జోరు ప్రదర్శిస్తోంది. మంగళవారం బెంగళూరు వేదికగా గుజరాత్ జెయింట్స్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భర్తీ ఫుల్మాలీ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డియాండ్రా దొతిన్ (26) పర్వాలేదనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, మారిజనే కాప్, అన్నాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి గెలుపొందింది. జెస్ జొనాస్సెన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్థసెంచరీ సాధించగా.. షఫాలీ వర్మ (44) కీలక ఇన్నింగ్స్‌తో మెరిసింది. గుజరాత్ బౌలర్లలో కాశ్వీ గౌతమ్ 2 వికెట్లు తీయగా.. గార్డనర్, తనూజ కన్వర్ చెరొక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పట్టికలో టాప్ స్థానానికి చేరుకోగా.. గుజరాత్ జెయింట్స్ ఆడిన నాలుగింటిలో మూడు ఓటములతో ఆఖరి స్థానానికి పరిమితమైంది. నేడు జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడనుంది.