దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే

Spread the love

  • 25 ఏళ్ల ఓటమికి టీమిండియా బదులు తీర్చుకునేనా?
  • భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్
  • దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 నుంచి
  • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

దుబాయ్, మార్చి 8: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా నేడు జరగనున్న ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 2.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజయంతో కివీస్ తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరుసగా నాలుగు మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడిన భారత్ పిచ్‌ను బాగా ఒంటపట్టించుకుంది. మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసినా ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటికే వ్యూహాలు రచించింది. దుబాయ్ పిచ్‌పై చేజింగ్ కష్టమని తెలిసినప్పటికీ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఛేదన ద్వారానే విజయం సాధించడం విశేషం. ఎలా చూసుకున్నా ఫైనల్లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఐసీసీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజిలాండ్ గెలిచిన ఏకైక ట్రోఫీ చాంపియన్స్ ట్రోఫీనే కావడం గమనార్హం. అది కూడా 2000 సంవత్సరంలో భారత్‌పైనే విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 2009లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల క్రితం ఓటమికి బదులు తీర్చుకునే సదవకాశం భారత్ ముంగిట నిలిచింది. ఇప్పటివరకు భారత్ రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీ (2002, 2013) గెలిచింది.

నలుగురు స్పిన్నర్ల వ్యూహంతోనే..

కివీస్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ నలుగురు స్పిన్నర్ల వ్యూహంతోనే బరిలోకి దిగనుంది. వరుణ్ చక్రవర్తి కీలకమయ్యే అవకాశముంది.లీగ్ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఈ అస్త్రంతోనే బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. షమీ, పాండ్యాలు పేస్ భారం మోయనున్నారు. ఇక భారత కెప్టెన్ రోహిత్, కోహ్లీ 2013లో ధోనీ నేతృత్వంలో గెలిచిన చాంపియన్స్ ట్రోఫీలో సభ్యులుగా ఉన్నారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరికి మరోసారి జట్టును చాంపియన్స్‌గా నిలిపే అవకాశం వచ్చింది. కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండగా.. రోహిత్ రాణించాల్సి ఉంది. గిల్, అయ్యర్, రాహుల్, అక్షర్, జడేజా, పాండ్యాలతో బ్యాటింగ్ బలంగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతా కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్రలపైనే ఆధారపడి ఉంది. ఈ ఇద్దరు అత్యుత్తమ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. వీరికి తోడు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్ విభాగంలో మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మాట్ హెన్రీతో కీలకం కానున్నారు.

కోహ్లీకి గాయం..

ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి గాయమైంది. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొంటున్న కోహ్లీ మోకాలి కింది భాగంలో బంతి బలంగా తగిలింది. దాంతో ఆయన ప్రాక్టీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.వెంటనే టీమ్‌ ఫిజియో బృందం కోహ్లీకి గాయమైన చోట నొప్పిని తగ్గించే స్ప్రే కొట్టి, బ్యాండేజీ వేశారు. గాయం కొంచెం బాధిస్తున్నప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిసేవరకు పరిశీలిస్తూ గ్రౌండ్‌లోనే ఉన్నాడు. గాయం పెద్దగా నొప్పేం లేదని తన టీమ్‌మేట్స్‌కు, టీమ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌కు కోహ్లీ చెప్పడం కనిపించింది. ఆ తర్వాత భారత్‌ కోచింగ్‌ సిబ్బంది కోహ్లీ గాయంపై క్లారిటీ ఇచ్చారు. కోహ్లీకి తగిలింది తీవ్ర గాయమేమీ కాదని, ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నాడని కోచింగ్‌ సిబ్బంది స్పష్టం చేశారు.

వర్షం కారణంగా రద్దయితే?

వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రద్దయితే వర్షం పడితే ఛాంపియన్‌గా ఎవరిని ప్రకటిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పటివరకైతే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఎదురయ్యే పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. మ్యాచ్ జరిగే ఆదివారంతోపాటు రిజర్వ్ డే అయిన సోమవారం కూడా ఐసీసీ రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయించింది. అంటే వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే అదనంగా మరో రెండు గంటలపాటు కూడా ఎదురు చూస్తారు. ఆ రెండు గంటల్లో కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే భారత్-న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.