ఫామ్‌లో లేడన్నారు.. మాపై దంచికొట్టాడు

Spread the love
– కోహ్లీ బ్యాటింగ్‌పై పాక్ కెప్టెన్ రిజ్వాన్ ప్రశంసలు
– అతడి ఫిట్‌నెస్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే

దుబాయ్: చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆదివారం దాయాది పాకిస్థాన్‌పై భార‌త్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. మాస్ట‌ర్ ఛేజ‌ర్ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగి టీమిండియాకు స్వీట్ విక్ట‌రీని అందించాడు. ఆ ఓట‌మితో టోర్నీ నుంచి దాదాపు ఔటైన పాకిస్థాన్ జ‌ట్టు నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్ మీడియా కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. సెంచ‌రీ హీరో విరాట్‌పై రిజ్వాన్ ప్ర‌శంస‌లు కురిపించాడు. చాలా ఈజీగా విరాట్ త‌న ఇన్నింగ్స్ ఆడిన తీరును రిజ్వాన్ మెచ్చుకున్నాడు. విరాట్ ఫిట్‌నెస్ అమోఘ‌ని పేర్కొన్నాడు. 36 ఏళ్ల వ‌య‌సులో ఇండియ‌న్ బ్యాట‌ర్ అంత ఫిట్‌నెస్ ఎలా మెంటేన్ చేస్తున్నాడ‌న్న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశాడు. విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 111 బంతుల్లో 100 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మీడియా స‌మావేశంలో పాకిస్థాన్ జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్న‌ల‌తో సంధిస్తున్నా.. విరాట్ కోహ్లీ ఆట‌తీరును మెచ్చుకోవ‌డానికి రిజ్వాన్ ఎక్కువ టైం కేటాయించాడు. విరాట్ ఆడిన తీరును చూశారా, అత‌ని హార్డ్‌వ‌ర్క్ నిజంగా స‌ర్‌ప్రైజ్ చేసిన‌ట్లు రిజ్వాన్ చెప్పాడు. అత‌నెంత క‌ష్ట‌ప‌డి ఉంటాడు.. అత‌ని ఫామ్‌లో లేడ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి, కానీ కీల‌క‌మైన మ్యాచ్‌లో అత‌ను ఆడిన తీరు ప్ర‌శంస‌నీయ‌మ‌న్నాడు. చాలా ఈజీగా బంతుల్ని ఆడేశాడ‌న్నాడు. విరాట్‌కు ప‌రుగులు ఇవ్వొద్దు అని ఎంత ప్ర‌య‌త్నించినా.. మ్యాచ్‌ను త‌మ నుంచి దూరం తీసుకెళ్లిన‌ట్లు చెప్పాడు. ర‌న్స్ రాబ‌ట్ట‌కుండా విరాట్‌ను నిలువ‌రించ‌లేక‌పోయిన‌ట్లు చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్న‌ట్లు రిజ్వాన్ తెలిపాడు. ఆ ఫిట్‌నెస్‌, ఆ హార్డ్‌వ‌ర్క్, ఇన్నింగ్స్‌ను అత‌ను ఫినిష్ చేసిన తీరు అద్భుత‌మ‌న్నాడు. అత‌నిలాగే మేం క్రికెట‌ర్ల‌మ‌ని, అత‌న్ని ఔట్ చేసేందుకు చాలా ట్రైం చేశామ‌ని, కానీ మ్యాచ్‌ను అత‌ను మా నుంచి లాక్కెళ్లాడ‌ని రిజ్వాన్ పేర్కొన్నాడు. కోహ్లీ వ‌న్డేల్లో 51వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇదే మ్యాచ్‌లో అత‌ను 14 వేల ప‌రుగులు మైలురాయి కూడా దాటేశాడు.

అయితే చాంపియ‌న్స్ ట్రోఫీలో త‌మ క‌థ ముగిసిన‌ట్లు పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ తెలిపాడు. కివీస్‌తో మ్యాచ్‌లో ఓడిన పాక్‌.. గ్రూపు ఏ నుంచి చివ‌రి స్థానంలో ఉన్న‌ది. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన బంగ్లాదేశ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో గెలిచినా.. సెమీస్‌కు వెళ్లే అవ‌కాశాలు స‌న్న‌గిల్లిన‌ట్లు చెప్పారు. ఇత‌ర మ్యాచ్‌ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డ‌డం స‌రైంది కాద‌న్నాడు.