ముంబై జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆదివారం ఢిల్లీతో జరిగిన పోరులో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో ఢిల్లీ అలవోకగా విజయం సాధిస్తుందని అనిపించినా కానీ ముంబై బౌలర్లు పట్టు వదల్లేదు. ఢిల్లీ బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్‌కు చేర్చి అద్భుత విజయాన్ని అందుకున్నారు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్లుగా వెనుదిరిగారు. ఢిల్లీకిది ఈ సీజన్‌లో తొలి ఓటమి. ఢిల్లీ తరఫున కరుణ్ నాయర్ (87) బరిలోకి దిగాడు. చివరగా 2022 సీజన్‌లో ఆడిన కరుణ్ మళ్లీ 1077 రోజుల నిరీక్షణ తర్వాత బరిలోకి దిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన నాయర్ తనదైన ముద్ర వేశాడు. ముంబై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ (3/36) ఢిల్లీ నడ్డివిరిచాడు. టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు 47 పరుగుల భాగస్వామ్యం అందించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (59) అర్ధ సెంచరీ, సూర్యకుమార్ యాదవ్ (40) పరుగులు చేయడంతో ముంబై 200 మార్కు దాటింది.
తొలి బంతికే షాక్..
206 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి బంతికే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కానీ తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ (89) ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. ఎప్పుడైతే కరుణ్ నాయర్ ఔటయ్యాడో తర్వాత వచ్చిన ఢిల్లీ బ్యాటర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేదు. చివర్లో ఒకే ఓవర్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్లు కావడంతో ఢిల్లీ ఓటమి లాంఛనం అయింది.