ముంబై ఇండియన్స్ చేజేతులా

Spread the love
  • 12 పరుగులతో లక్నో విజయం
  • రాణించిన మార్ష్, మార్కరమ్
  • పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా
  • నేడు సీఎస్కేతో ఢిల్లీ, పంజాబ్‌తో రాజస్థాన్ అమీతుమీ

లక్నో, ఏప్రిల్ 4: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60), మార్కరమ్ (38 బంతుల్లో 53) రాణించగా.. మిడిలార్డర్‌లో ఆయుశ్ బదోని (30), మిల్లర్ (27) పర్వాలేదనిపించడంతో లక్నో 200 పరుగుల మార్క్‌ను అధిగమించింది. ముంబై బౌలర్లలో పాండ్యా 5 వికెట్లతో చెలరేగడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ (67), నమన్ ధిర్ (46) ఆకట్టుకున్నారు. చివర్లో పాండ్యా (28*) జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్, శార్దూల్, ఆకాశ్, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు. నేడు డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ, రెండో మ్యాచ్‌లో పంజాబ్‌తో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఓపెనర్లు మినహా..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మార్ష్, మార్కరమ్ కలిసి తొలి వికెట్‌కు 76 పరుగుల జోడించారు. ధాటిగా ఆడిన మిచెల్ మార్ష్‌ను పాతుర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో క్రీజులోకి వచ్చిన హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ (12) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. పాండ్యా బౌలింగ్‌లో చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ పంత్ (2) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ దశలో మార్కరమ్‌కు జత కలిసిన ఆయుశ్ బదోని (19 బంతుల్లో 30) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా.. ఆఖర్లో మిల్లర్ (14 బంతుల్లో 27) రాణించడంతో లక్నో 203 పరుగులు చేసింది.

కొంపముంచిన తిలక్ వర్మ*

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మెరుగైన ఆరంభం దక్కలేదు. విల్ జాక్స్ (5), రికెల్ టన్ (10) వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో నమన్ ధిర్ (46)తో కలిసి సూర్యకుమార్ (67) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. నమన్ ధిర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (23 బంతుల్లో 25) నిధానంగా ఆడి ముంబై కొంపముంచాడు. చివర్లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాడినప్పటికీ లాభం లేకపోయింది.

స్టాట్:

  1. ఐపీఎల్లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కిన హార్దిక్ పాండ్యా. టీ20 క్రికెట్‌లో పాండ్యాకు (5/35) కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు.
  2. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో కెప్టెన్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యా (30 వికెట్లు). షేన్ వార్న్ (57 వికెట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు