ముంబై ఇండియన్స్ ఘన విజయం

Spread the love
  • 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమి
  • విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
  • నేడు బెంగుళూరుతో ముంబై ‘ఢీ’

ముంబై, ఏప్రిల్ 17: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై గెలుపును అందుకుంది. గత మ్యాచ్‌లో దుమ్మురేపిన హైదరాబాద్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), క్లాసెన్ (37) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, బుమ్రా, పాండ్యాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. విల్ జాక్స్ (36 ) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. రికిల్‌టన్ (31), సూర్యకుమార్ (26) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో మెరిశాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.

‘సన్‌రైజ్’ అవ్వని బ్యాటర్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ పరుగులు పెద్దగా రాలేదు. అభిషేక్ (40), హెడ్ (28) తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. అభిషేక్ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (2) విఫలమయ్యాడు. ఆ తర్వాత నితీశ్ కుమార్ (19) క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డాడు. చివర్లో క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.