ఏఐ రంగంలో భారత్ పురోగతిపై ప్రపంచ దేశాల ప్రశంసలు
ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి సేవలపై హర్షం
119వ ‘మన్‌కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కొత్త టెక్నాలజీలను వినియోగించడంలో భారతీయులు ఎవరికీ తీసిపోరని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 119వ ‘మన్‌కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పారిస్ వేదికగా జరిగిన కృత్రిమ మేధ(ఏఐ) సదస్సు విశేషాలను ప్రజలతో పంచుకున్నారు. ఏఐ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేయడం ద్వారా గిరిజన భాషలను పరిరక్షించడంలో కైలాశ్ తమకు సాయం చేసినట్టు వెల్లడించారు.
ఇస్రో తన 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఈ విజయం యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నట్టు పేర్కొన్న ప్రధాని.. గత 10 సంవత్సరాల్లో ఇస్రో దాదాపు 460 ఉపగ్రహాలను లాంచ్ చేసినట్టు వెల్లడించారు. ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడం మంచి పరిణామమన్నారు. ఈ క్రమంలోనే నేషనల్ సైన్స్ డే గురించి ప్రధాని ప్రస్తావించారు. యువత, పిల్లలు ఏదైనా ఒక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజు మొత్తం శాస్త్రవేత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం ద్వారా సైన్స్‌పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. అంతేకాకుండా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు తన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే అవకాశం మహిళలకు ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. అలాగే భారత్ ఆరోగ్యవంతమైన దేశంగా మారాలంటే ఊబకాయం సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. ఓ అధ్యాయనం ప్రకారం ప్రతి 10 మందిలో ఎనిమిది మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయటపడానికి వంటనూనె వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్.. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించారు.