ఇంట పిల్లి.. బయట పులి ‘ఆర్సీబీ’

Spread the love

ఇంకో విజయం నమోదు

రాణించిన కోహ్లీ, పడిక్కల్

ముల్లన్‌పూర్, ఏప్రిల్ 20: ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హవా కొనసాగుతోంది. సొంత గడ్డపై వరుసగా మ్యాచులు ఓడిపోతున్నా కానీ బయట మాత్రం వరుస పెట్టి మ్యాచులు గెలుస్తూనే ఉంది. తాజా

 

గా ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (73*), దేవదత్ పడిక్కల్ (61) చెలరేగడంతో ఆర్సీబీ మరో సునాయస విజయం సాధించింది. పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే తనేంటో నిరూపించుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. పంజాబ్ బ్యాటర్లు విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కాపాడలేకపోయారు.
టాస్‌తో పాటు మ్యాచ్ కూడా..

 

టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించిన తర్వాత ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఈ జోడీకి చెక్ పెట్టాడు. ఇక అక్కడి నుంచి పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పెద్ద స్కోరుకు అవకాశం లేకుండా పోయింది. చివర్లో శశాంక్ సింగ్ (31*), మార్కో యన్సెన్ (25*) బ్యాట్ ఝలిపించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే చుక్కెదురైంది. ఫామ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్ (1)ను అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు. దీంతో పంజాబ్ బౌలర్లు మళ్లీ మాయ చేస్తారని అంతా అనుకున్నా కానీ అలా జరగలేదు. వన్ డౌన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పడిక్కల్, కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 100+ పార్ట్‌నర్‌షిప్ జోడించాడు. దీంతో ఆర్సీబీ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. ఇంకా 7 బంతులు మిగిలుండగానే.. ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్, సుయాశ్ చెరి రెండు వికెట్లు, షెఫర్డ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది.