ఈ సాలా కప్ నమ్‌దే’ బ్రేకుల్లేని ఆర్సీబీ

Spread the love
  • ముంబైపై విజయం సాధించిన ఆర్సీబీ
  • విరాట్ కోహ్లీ, పాటిదార్ అర్ధ సెంచరీలు
  • ఉత్కంఠగా మ్యాచ్

ముంబై, ఏప్రిల్ 7: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్ గెలిచింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయఢంకా మోగించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి విజయం బెంగళూరునే వరించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (67), కెప్టెన్ పటీదార్ (64) అర్ధ సెంచరీలు చేశారు. 222 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయడంతో హోం గ్రౌండ్‌లో ఓటమిని అంగీకరించక తప్పలేదు. హర్ధిక్ పాండ్యా (42) (15 బంతుల్లో) ఆశలు రేపినా విజయం మాత్రం ముంబై దరి చేరలేదు. నేడు డబుల్ హెడర్‌లో భాగంగా.. మధ్యాహ్నం కేకేఆర్, ఎల్‌ఎస్‌జీ.. రాత్రి పంజాబ్, చెన్నై జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ప్రభావం చూపని బుమ్రా..

చాలా రోజుల తర్వాత ఈ మ్యాచ్‌లో ఆడిన టీమిండియా పేసు గుర్రం, ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా 29 పరుగులిచ్చి వికెట్లేమీ నేలకూల్చలేదు. ముంబై బౌలింగ్ అద్భుతంగా చేసి ఆర్సీబీని అంత భారీ స్కోరు చేయనియకపోతే ముంబైకి విజయం దక్కేది. ముంబై 5 మ్యాచ్‌లు ఆడి 4 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో మన కాటేరమ్మ కొడుకులతో పోటీ పడుతుంది.