- బెంగళూరుకు మరో విజయం
- తేలిపోయిన రాజస్థాన్
జైపూర్, ఏప్రిల్ 13: డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శాంసన్ సేన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 173 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (75) అర్ధ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. మరో ఓపెనర్ కెప్టెన్ సంజూశాంసన్ (15) తీవ్రంగా నిరాశపర్చాడు. శాంసన్ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆర్‌ఆర్ 175 పరుగులు కూడా క్రాస్ చేయలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాళ్, హేజిల్‌వుడ్, పాండ్యాలు తలో వికెట్ తీసుకున్నారు. 174 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు.
ఊచకోత..
చేజింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (62*), ఫిల్ సాల్ట్ (65) ఆర్‌ఆర్ బౌలర్లను ఊచకోత కోశారు. సంజూశాంసన్ ఎంత మంది బౌలర్లను మార్చినా కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో ఆర్సీబీ అలవోకగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఈ జోడీ పవర్ ప్లేలోనే 65 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ నుంచి క్రమంగా ఈ జోడీ మ్యాచ్‌ను లాగేసుకుంది. ఎట్టకేలకు 9వ ఓవర్లో ఈ జోడీని విడదీయంలో రాజస్థాన్ సక్సెస్ అయింది. అయినా కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆర్సీబీకి విజయం నల్లేరు మీద నడకలా మారిపోయింది. ఇంకా 15 బంతులు మిగిలుండగానే ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీకి ఈ సీజన్‌లో ఇది నాలుగో విజయం. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకుపోయింది.