ప్రతీకార సమయం ఆసన్నం

Spread the love

  • దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్
  • 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకునే చాన్స్
  • నలుగురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి రోహిత్ సేన
  • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

అది 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టైటిల్ ఫైట్‌కు సిద్ధమైంది. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా జైత్రయాత్ర కొనసాగించిన రోహిత్ సేనకు ఫైనల్లో ఆస్ట్రేలియా ఊహించని షాక్ ఇచ్చింది. భారత్ విధించిన సాధారణ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ఆసీస్ ఆరోసారి వన్డే చాంపియన్స్‌గా నిలవడంతో కోట్లాది మంది భారతీయుల హృదయాలు ఒక్కసారిగా బరువెక్కిపోయాయి. తాజాగా ఆ ఓటమికి బదులు తీర్చుకునేందుకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో టీమిండియాకు అరుదైన అవకాశం లభించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో ఆసీస్‌ను ఓడించడంతో పాటు టోర్నీ నుంచి వారిని నాకౌట్ చేసే సదవకాశం భారత్‌ను ఊరిస్తుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశకు చేరిందంటే ఆస్ట్రేలియా బెబ్బులిలా విరుచుకుపడుతుంది. మరి వారి గర్వాన్ని అణచి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టాలని ఆశిద్దాం.

దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. మరోసారి టీమిండియాను ఓడించి తమ రికార్డును మెరుగుపరుచుకోవాలని ఆసీస్ ఆరాటపడుతోంది. లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచిన టీమిండియా గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌లో అడుగపెట్టింది. మరోవైపు వర్షం అంతరాయంతో ఒక మ్యాచ్ రద్దవ్వగా.. రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్ గ్రూప్ నుంచి రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య 141 వన్డేలు జరగ్గా.. ఆస్ట్రేలియా 84 విజయాలతో ముందంజలో ఉండగా.. భారత్ 57 విజయాలు సాధించింది. ఇక ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్లు ముఖాముఖి రికార్డు 10 ఉంది.

నలుగురు స్పిన్నర్లతో బరిలోకి

టీమిండియా తుది జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారిపోయింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు నలుగురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగి భారత్ విజయం సాధించింది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన వరుణ్ చక్రవర్తి ఏకంగా ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరవడంతో అతడిని తప్పించాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. అక్షర్ పటేల్, జడేజాలు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయడంలో సమర్థులు కావడంతో ఆల్‌రౌండర్ల కోటాలో వారికి జట్టులో చోటు దక్కడం ఖాయమే. ఇక కుల్దీప్ యాదవ్ ఎలాంటి పిచ్‌లైనా సరే తన స్పిన్‌తో మ్యాచ్‌కు కనీసం రెండు వికెట్లు తీయడం చేస్తున్నాడు. ఎలా చూసుకున్నా ఈ నలుగురిని తుది జట్టులో ఆడించాల్సిందే. ఇక ప్రధాన పేసర్‌గా షమీ వికెట్లు తీయలేకున్నప్పటికీ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసీస్ బ్యాటర్లు లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో సరిగ్గా ఆడరు అనుకుంటే షమీ స్థానంలో అర్ష్‌దీప్ జట్టులోకి రావొచ్చు. కానీ రోహిత్ షమీకి విశ్రాంతినిచ్చే సాహసం చేస్తాడా అన్నది చూడాలి. దీంతో కివీస్‌తో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రోహిత్, గిల్ మెరవాల్సిందే..

ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, గిల్ రాణించాల్సిన అవసరముంది. పాక్‌తో మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ కివీస్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. టాపార్డర్ మెరిస్తే మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలతో పటిష్టంగా కనిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో జడేజా పరుగులు సాధించడంలో విఫలమైనప్పటికీ కీలక మ్యాచ్‌లో రాణిస్తాడన్న పేరుంది. ఒకవేళ జడేజాను వద్దనుకుంటే సుందర్‌ను జట్టులోకి తీసుకునే చాన్స్ కూడా ఉంది.

ఆ ముగ్గురే సమస్య..

ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఎప్పటికీ ప్రమాదకారే. ముఖ్యంగా నాకౌట్‌కు చేరిన సందర్భాల్లో కంగారూలు ఓటమిని అంత త్వరగా ఒప్పుకోరు. పోరాడే తత్వం బలంగా ఉండే ఆ జట్టులో ముగ్గురు మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్.. ఈ ముగ్గురు భారత్‌తో మ్యాచ్ అంటే చాలు చెలరేగిపోతారు. స్పిన్‌ను సమర్థంగా ఆడడంలో ఈ ముగ్గురి నైపుణ్యం అదుర్స్. వీరిని తక్కువ స్లోర్లకే కట్టడి చేయడం చాలా ముఖ్యం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న భారత్‌కు కష్టాలు తప్పవు. ఇక ఈ ముగ్గురితో పాటు జోస్ ఇంగ్లిస్, మాక్స్‌వెల్, అలెక్స్ కేరీ, జేమ్స్ ఫ్రేజర్ కూడా కీలక ఆటగాళ్లే. టాప్ బౌలర్ల సేవలను కోల్పోయిన ఆసీస్ బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆడమ్ జంపా మినహా ఆ జట్టులో స్పెషలిస్ట్ స్పినర్ లేకపోవడం పెద్ద మైనస్. నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్‌సుయిస్ కీలకం కానున్నారు.

తుది జట్ల అంచనా:
టీమిండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్, జడేజా, వరుణ్, కుల్దీప్, షమీ.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), హెడ్, మెక్ గుర్క్, లబుషేన్, జోస్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్‌సుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్