ఊహకందని విజయం

Spread the love
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం
  • 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి
  • సెంచరీ బాదిన అభిషేక్ శర్మ

‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్పాడాలి’ అని ఠాగూర్ సినిమాలోని పాటకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ విజయం తర్వాత పేలవ ఆటతీరుతో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యి పాయింట్ల పట్టికలోనూ అట్టడుగు స్థానానికి పడిపోయింది. వరుస పరాజయాలను మరిపిస్తూ ఉప్పల్‌లో కాటేరమ్మ కొడుకులు పంజాబ్‌ను ఉతికారేశారు. అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్టు చెలరేగి ఆడగా.. హెడ్ విధ్వంసంతో ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయంతో వరుస ఓటములకు ముగింపు పలికింది.

ఉప్పల్/లక్నో, ఏప్రిల్ 12: ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఊహకందని విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పరుగుల వరద పారిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82) విధ్వంసానికి తోడు ప్రభ్‌సిమ్రన్ (42), స్టోయినిస్ (34*) చెలరేగారు. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141) విధ్వంసక సెంచరీతో చెలరేగగా..హెడ్ (66) రాణించాడు. అర్ష్‌దీప్, చాహల్ చెరొక వికెట్ తీశారు.

లక్నో ‘హ్యాట్రిక్’ విజయం

మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (56), శుబ్‌మన్ గిల్ (60) రాణించారు. శార్దూల్, రవి బిష్ణోయి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో లక్నో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పూరన్ (61), మార్కరమ్ (58) అర్థసెంచరీలతో మెరవగా.. ఆయుశ్ బదోని (28*) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రసిధ్ క్రిష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. డబుల్ హెడర్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో బెంగళూరు, ముంబైతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.