– శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహణ
వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టోర్నీ సెప్టెంబర్‌లో జరుగుతుంది. భారత్ వద్ద ఆతిథ్య హక్కులున్నప్పటికీ యూఏఈ లేదా శ్రీలంకలో టోర్నీ జరిగే అవకాశముంది’ అని తెలిపాడు. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఓమన్, హాంకాంగ్ తలపడనున్నాయి.
టీమిండియా ఎనిమిది సార్లు..
2023లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని విజేతగా నిలిచింది. 1984లో మొదలైన ఆసియా కప్‌ను భారత్ అత్యధికంగా 8 సార్లు కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఆరుసార్లు విజేతగా నిలిచిన శ్రీలంక తర్వాతి స్థానంలో ఉండగా.. పాక్ రెండుసార్లు విజేతగా నిలిచింది.